కేంద్ర, రాష్ట్ర ప్రజా వ్యతిరేక విధానాలపై ఆందోళనలు
పెట్టుబడిదారులకు మాత్రం రాయితీలు
మండల తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా
సీపీఐ(ఎం)జిల్లాకార్యదర్శి మోకు కనకారెడ్డి
ప్రభుత్వ స్క్రీంలు బీఆర్ఎస్ పథకాలుగా మారుతున్నాయని సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి ఆరోపించారు.మంగళవారం రోజున సీపీఎం బచ్చన్నపేట మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక చౌరస్తా నుండి తాసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు సిపిఎం మండల కార్యదర్శి బెల్లంకొండ వెంకటేష్, అధ్యక్షత వహించగా సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనక రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఎన్నికలకు ఆరు, మూడు నెలల ముందు ప్రకటించే పథకాలు మోసపూరి పథకాలని వాటిని ప్రజలు నమ్మొద్దని వారు అన్నారు. ఈ పథకాలనైనా ‘గులాబీ‘ పథకాలుగా కాకుండా అర్హులందరికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రజలపై విపరీతమైన భారాలను మోపుతోందని అన్నారు. కార్పొరేట్లు, పెట్టుబడిదారులకు రాయితీలిస్తూ సామాన్యలపై భారాలు వేస్తుందన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం పథకాల అమలులో పారదర్శకంగా వ్యవహరించాలని కోరారు. 2018లో ప్రకటించిన రూ.లక్ష రుణమాఫీ వడ్డీలకే సరిపోతుందన్నారు. వడ్డీలు చెల్లించకపోతే రుణమాఫీ వర్తించదని, కొత్త రుణాలు ఇవ్వమనడంతో రైతులు ప్రైవేట్ గా అప్పుచేసి వడ్డీలు చెల్లించారన్నారు. రెన్యువల్ అయినా కాకపోయినా కొర్రీలు పెట్టకుండా 2018 నవంబర్ 11 కు ముందు ఉన్న రుణాలన్నింటిని మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్య, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఆశా వర్కర్లు, సెకండ్ ఏఎన్ఎంల క్రమబద్దీకరణ, ఖాళీలకు తగినట్టుగా టీచర్ పోస్టుల భర్తీ తదితర సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయన్నారు.
9 ఏళ్ల మోడీ ప్రభుత్వ కాలంలో 50 శాతంగా ఉన్న ధరల పెరుగుదల 200 శాతానికి చేరిందని అన్నారు. కిలో కందిపప్పు రూ.90 నుంచి రూ.170కి చేరిందని, నిత్యవసర వస్తువులు, పెట్రోలు, డీజిల్, గ్యాస్ ఇలా అన్నింటి ధరలు పెరిగాయన్నారు. రక్షాబంధన్ కానుక పేరుతో కేంద్రం రూ.200 గ్యాస్ ధరను తగ్గించిందని, అంతర్జాతీయంగా సహజ ముడి వనరుల ధరలు తగ్గిన దృష్ట్యా సిలిండర్ ధరను రూ. 400 తగ్గించాలని డిమాండ్ చేశారు. మోడీ హయాంలో రూ. 15లక్షల కోట్ల భారం దేశ ప్రజలపై పడిందన్నారు. ధరల భారంతోనే ఇబ్బంది పడుతుంటే జిఎస్టి పేరుతో పన్నుల భారం వేస్తున్నారని తెలిపారు. పన్నులు, ధరల భారంతో దేశంలో పేదరికం పెరిగి 40 శాతం ప్రజానీకం పౌష్టికాహార లోపంతో ఇబ్బంది పడుతుందన్నారు. 57% మహిళలు, 67% పిల్లలు రక్తహీనతతో బాధపడుతున్నట్లు చెప్పారు. 67 ఏళ్లలో 14 మంది ప్రధానులు రూ.55.87 లక్షల కోట్ల అప్పులు చేస్తే మోడీ 9 ఏళ్లలో రూ. 100 లక్షల కోట్లు అప్పు చేసినట్లు వివరించారు. కార్పొరేట్, పెట్టుబడుదారుల రాయితీ కోసం చేసిన అప్పుల భారం ప్రజలపై మోపుతున్నారన్నారు. పెట్టుబడిదారులకు 10% పన్ను తగ్గించి, సామాన్యులపై 18% పన్ను భారం వేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను బాహటంగానే ప్రైవేటీకరిస్తున్నట్లు మోడీ ప్రకటించడాన్ని బట్టి కార్పొరేట్ శక్తులకు ప్రధాని ఎంతలా కొమ్ము కాస్తున్నాడో అర్థం చేసుకోవాలన్నారు. ఉపాధి హామీకి నిధుల కోత, సహజ సంపదను పెట్టుబడిదారులకు కట్టబెట్టడం, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల పై దాడులు, పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వామ్య హక్కులపై దాడులు మోడీ హయాంలో అధికమయ్యాయని తెలిపారు. ప్రజాస్వామ్యం అమలు కాని దేశాల్లో ప్రపంచంలోనే 112 వ స్థానంలో మన దేశం ఉండటం గమనార్హం అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ పథకాలు బీఆర్ఎస్ స్ల్కీమ్ లుగా మారాయని ధ్వజమెత్తారు. దళితబంధు పథకంలో ఒక్కొక్క ఎమ్మెల్యే రూ 3 లక్షల వరకు లంచం తీసుకున్నట్లు స్వయంగా సీఎం ప్రకటించినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. గృహలక్ష్మి పథకం కింద రూ.3 లక్షలకు బదులుగా రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లాటరీ సిస్టం ద్వారా అర్హులను ఎంపిక చేయాలని కోరారు. రూ.లక్ష బీసీ పథకానికి జిల్లాలో 26,500 మంది దరఖాస్తు చేసుకుంటే కేవలం 1500 మందికి చెక్కులు పంపిణీ చేశారని తెలిపారు. మైనార్టీలు 8,000 మంది దరఖాస్తు చేస్తే కేవలం 100 మందిని మాత్రమే ఎంపిక చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ప్రభుత్వ పథకాల్లో పారదర్శకత లోపిస్తుందని, అవి కేవలం బీఆర్ఎస్ పథకాలుగా మారుతున్నాయని ఆరోపించారు. బచ్చన్నపేట మండలం చిన్నంచర్ల గ్రామ శివారులో ఉన్న 174 సర్వే నెంబర్ పై ఉన్న స్టేటస్కో ఆర్డర్ ను వెంటనే రద్దుచేసి అట్టి భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని పేదలకు పంచాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మండల తాసిల్దార్ విశాలాక్షి కి అందించారు .ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సుంచు విజేందర్ మండల కమిటీ సభ్యులు రామగళ్ళ అశోక్ మినలాపురం ఎల్లయ్య ఎడబోయిన రవీందర్ రెడ్డి బైరగోని బలరాం అన్న బోయిన రాజు కంత్రి ఐలయ్య బోదాసు సుధాకర్ బుర్రి సుధాకర్ మహంకాళి జనార్ధన్ బోడ పట్ల బాలరాజ్ పర్వతం నరసింహులు కడకంచి బాలరాజు కడకంచి మల్లయ్య యాదగిరి పద్మ సుజాత శోభ లక్ష్మి ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.
0 Comments