జనగామ: జిల్లాలోని బచ్చన్నపేట మండలంలో ఇటీవల జరిగిన రిటైర్డ్ ఎంపీడీవో, ఆర్టిఐ కార్యకర్త నల్ల రామకృష్ణయ్య హత్యలో పాల్గొన్న హంతకులను మరియు హత్యకు సూత్రదారులైన వారిని వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) జనగామ జిల్లా అధ్యక్షులు మిన్నలాపురం జలంధర్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా జనగామ జిల్లా కేంద్రంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జంగిటి నరేష్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా అధ్యక్షులు మిన్నలాపురం జలంధర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ఎవరికైనా ఉంటుందని, భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను, చట్టాలను అనుసరించి అవినీతి అవినీతి అక్రమార్కులపై సత్యాగ్రహ పోరాటం ద్వారా ఆర్.టి.ఐ చట్టం ద్వారా అవినీతి అక్రమాలను వెలికితీసి సమాజంలో దోషులుగా చూపిస్తుంటే తట్టుకోలేని వ్యక్తులు ఇటువంటి హత్యలను చేయించడం దుర్మార్గమని ఆవేదన చెందారు. నల్ల రామకృష్ణయ్య దేశానికి సేవ చేసిన రిటైర్డ్ ఎంపీడీవో అని తన శేష జీవితంలో అవినీతి అక్రమాలను వెలికి తీయడానికి రాజ్యాంగం కల్పించిన బ్రహ్మాస్త్రమైన ఆర్టిఐ చట్టం ద్వారా పేద ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నారని అన్నారు. ఆర్టిఐ కార్యకర్తను చంపడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని చంపినట్లే అని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రచార కార్యదర్శి యాసారపు కరుణాకర్ మాట్లాడుతూ దోషులను వెంటనే అరెస్టు చేయాలని ఈ హత్యకు సూత్రధారులు అయినటువంటి నాయకులను,ప్రజాప్రతినిధులను ఎంతటి వారైనా చట్టాల ప్రకారం శిక్షించాలని రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్కు విజ్ఞప్తి వేశారు. రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చానకొండ రమేష్ రెడ్డి మాట్లాడుతూ అవినీతి అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి చట్టాలకు భయపడి నిజాయితీని నిరూపించుకోలేక హత్యలకు పాల్పడడం పిరికిపందల చర్యగా అభివర్ణించారు. ఏదేమైనా దోషులను కఠినంగా శిక్షించాలని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థ మీద ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బక్క రవి,విజయభాస్కర్,గణేష్ తదితరులు పాల్గొన్నారు.
0 Comments