ఈ దేశంలో పదకొండేళ్లుగా బీజేపీనే అధికారంలో ఉన్నది. సరిహద్దులు దాటి ఈ దేశంలోకి టెర్రరిస్టులు వచ్చి అమాయక ప్రజలను దారుణంగా హతమారిస్తే దానికి పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అవుతుంది కదా. నిన్న ఆ ఉన్మాదుల దాడిలో ఒక ముస్లిం కూడా మరణించాడు. కానీ ఈ విషయం మనలో అత్యధిక మందికి తెలియదు.
దేశం ఇప్పటికే పేలడానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతంలా ఉన్నది. ఇలాంటప్పుడు అధికారంలో ఉన్న బీజేపీనే ఒక మతం మీదికి ఇంకో మతం ప్రజలను ఉసిగొల్పే విధంగా రెచ్చగొట్టడం ఎంతవరకూ సబబు?
ఉగ్రవాదులకు కావల్సిందే ఇది. మన దేశంలో మతం పేరిట మంటలు రేగితే, ఆ ఉగ్రవాదుల ప్లాన్ సక్సెస్ అయినట్టే.
నిన్న ఉగ్రదాడి జరుగుతున్న సమయంలో నరేంద్ర మోడీ ఎక్కడున్నారు?
ఆయన ఈ ప్రపంచంలోనే అత్యంత మత ఛాందస ముస్లిం దేశాల్లో ఒకటైన సౌదీ అరేబియా రాజధాని జెడ్డాలో అక్కడి పాలకుల ఆతిథ్యం స్వీకరిస్తున్నారు.
మరి ముస్లింలు అందరూ టెర్రరిస్టులని, మన వీధి చివర పూలమ్ముకునే, పండ్లమ్ముకునే పేద ముస్లింల షాపులను బాయ్‌కాట్ చేయాలని ఇక్కడ మన గ్రామాల్లో, పట్టణాల్లో బీజేపీ పార్టీ విషం నూరిపోస్తుంటే , ఒక ఛాందసవాద ముస్లిం దేశంలో మోదీ ఏం చేస్తున్నారు?
ఇక్కడ ముస్లింలను “పంచర్లు అతికే వాళ్లు” అని హేళన చేసే నరేంద్ర మోదీ ఎందుకు మరి ముస్లిం దేశాలకు వెళ్లి అక్కడి పాలకులను ఆలింగనం చేసుకుంటున్నాడో ఒక్క క్షణం ఆలోచించండి.
బతుకుతెరువు కోసం పంచర్లు అతుక్కునో, పూలమ్మో, పండ్లమ్మో బతుకువెళ్లదీస్తున్న లక్షలాది పేదవారిని మతం ముద్రవేసి, వారి బతుకుదెరువును దెబ్బతీస్తే, జీవనోపాధికి ఇక ఏ ఆధారమూ లేక వారు అతివాదం వైపు మళ్లితే ఈ దేశం రావణకాష్టం అవదా? ఈ సోయి మన కేంద్ర బీజేపీ పెద్దలకు లేదా?
తీవ్రవాదాన్ని అందరం వ్యతిరేకించాలి. మతం పేరిట ఎవరు హింసను రెచ్చగొట్టినా దాన్ని ఖండించాల్సిందే. కానీ తీవ్రవాదులను బూచిగా చూపి దేశంలోని పేద ముస్లిముల మీదికి మెజారిటీ ప్రజలను ఎగదోసి ఆ మంటల్లో చలిగాచుకునే బీజేపీ పట్ల అప్రమత్తంగా ఉండాలి.
***తాజా అప్డేట్: నిన్నటి ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారిలో ఇద్దరు ముస్లింలు ఉన్నారు!
0 Comments