ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇండ్ల స్థలాలను, రోడ్లను మరియు 350 ఎకరాల ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యంపై కేసులు నమోదు చేయకుండా, తమ స్థలాల్లో ఇండ్లు నిర్మించుకోవడానికి వెళ్ళిన పేదలను, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీతో పాటు, జిల్లా నాయకులను అరెస్టు చేయడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) CPIM తీవ్రంగా ఖండిస్తున్నది.
రామోజీ ఫిలింసిటీ దగ్గర నాగన్‌పల్లి, పోల్కంపల్లి గ్రామాలకు చెందిన దాదాపు 700 మంది పేదలకు ఒక్కొక్కరికి 60 గజాల చొప్పున 2007 సంవత్సరంలో ప్రభుత్వం పట్టాలిచ్చింది. కానీ ఆ భూమి మీదకు ప్రజలు వెళ్లి నివాసం ఏర్పాటు చేసుకోకుండా రామోజీ సంస్థ దారిని ఆక్రమించి, చుట్టూ గోడ నిర్మించి సెక్యూరిటీని పెట్టి అడ్డుకుంటున్నది. స్థలాలలోకి వెళ్ళిన 75 మంది పేదలపై గతంలో అక్రమ కేసులు పెట్టి సంవత్సరాల తరబడి కోర్టులు చుట్టూ తిప్పింది. జిల్లా కలెక్టర్, పోలీస్ యంత్రాంగం, స్థానిక ఎంఎల్‌ఏ జోక్యం చేసుకుని దీనిని పరిష్కరించకుండా జాప్యం చేస్తూ, రామోజీ సంస్థకే అనుకూలంగా వ్యవహరిస్తున్నది. ఈ నేపథ్యంలో సీపీఐ(ఎం)CPIM ఆధ్వర్యంలో 400 మంది లబ్దిదారులను వారికి ఇచ్చిన స్థలాల వద్దకు తీసుకెళ్లడంతో పోలీసులు నాయకులపై, పేదలపై కర్కశంగా ప్రవర్తించి అరెస్టులు చేసింది. ఈ దుశ్చర్యను సీపీఐ(ఎం) CPIM తీవ్రంగా ఖండిస్తున్నది. అరెస్టు చేసిన వారిని తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నది.
తక్షణమే ప్రభుత్వ భూమిని ఆక్రమించిన రామోజీ సంస్థపై కేసులు నమోదు చేయాలని, పేద ప్రజలకు తమ ఇంటి స్థలాలను అప్పగించి, అక్కడే నివాసం ఉండే విధంగా ఇండ్లు నిర్మించుకోవడానికి నిధులు కేటాయించాలని లేనట్లయితే సీపీఐ(ఎం) CPIM ఆధ్వర్యంలో జిల్లావ్యాపితంగా ఇండ్లు లేని పేదలందరినీ సమీకరించి రామోజీ సంస్థ ఆక్రమించిన 350 ఎకరాల భూమిని కూడా స్వాధీనం చేసుకుని గుడిసెలు వేసే కార్యక్రమానికి పూనుకుంటామని ప్రభుత్వాన్ని సీపీఐ(ఎం)CPIM హెచ్చరిస్తున్నది.
తమ్మినేని వీరభద్రం
CPIM కేంద్రకమిటీ సభ్యులు
0 Comments