OUR SOCIETY TV


Contact for adds :Vishnu Bashapaka CEO Our Society Media Group Email : vishnubashapaka@gmail.com Cell No: 8019649778 Please do Subscribe youtube channel OUR SOCIETY TV

'కుమ్మెర’ లేవనెత్తిన ప్రశ్న హిందువులంతా బంధువులేనా? సంపతి రమేశ్

  

The question raised by 'Kummera' is Are all Hindus relatives

భారత రాజ్యాంగం సమానత్వం అనే మహోన్నత విలువలపై నిర్మించబడింది. ఆ పునాదులకు రూప శిల్పి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్. కానీ ఇప్పటికీ రాజ్యాంగం ఆశించిన సమానత్వం ఆమడదూరంలోనే ఉన్నది. అయితే, హిందువులంతా బంధువులమనే భారతీయ సమాజంలో దేవాలయం దగ్గర కులం పేరుతో జరిగిన దాడి మరోమారు హిందు ధర్మంలో అసమానతలను నొక్కిచెబుతున్నది. ఇదీ హిందుత్వానికి మాయనిమచ్చ. ఇటీవల నాగర్ కర్నూలు జిల్లా, కుమ్మెర గ్రామంలో మల్లన్న స్వామి జాతరలో బిసి చాకలి కుటుంబంపై జరిగిన దాడి దేశాన్ని కుదిపేస్తుంది. 

రెండు నెలల పసిబిడ్డను అత్యంత క్రూరంగా కాలితో తన్ని హత్య చేసిన ఆ గ్రామ అగ్రకుల పెత్తందారుల ఆధిపత్యం మానవత్వానికి మచ్చగా మిగిలింది. ఒక శిశువు ప్రాణం కుల అహంకారానికి బలి కావడం కేవలం నేరమే కాదు, అది మానవత్వంపై జరిగిన దాడి. దేవాలయ ప్రవేశం, ఆధ్యాత్మిక హక్కుల విషయంలో సబ్బండ కులాలపై వివక్ష- ఆధునిక భారతదేశంలోనూ బహిర్గతమవుతుంది. శివుని సమానత్వానికి ప్రతిరూపమైన మల్లన్న దేవుడి గుడిలో జరిగిన ఘటన అనేక ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఇది కేవలం ఒక గ్రామ సమస్య కాదు, ఆధ్యాత్మిక నిర్మాణంలో దాగి ఉన్న అసమానతలకు ప్రతిబింబంగా నిలిచింది.

ఈ అన్యాయంపై మొట్టమొదట గళమెత్తిన నాయకుడు బిసి, ఎస్‌సి, ఎస్‌టి ఎస్టీల విముక్తి ఉద్యమ రథసారధి డాక్టర్ విశారదన్ మహరాజ్. ఆయన హిందూ ధర్మంలో బిసి, ఎస్‌సి, ఎస్‌సిల వాటా ఎంత? అని వేసిన ప్రశ్న పలువురుని ఆలోచింపచేస్తుంది. ప్రపంచానికే విద్య, విజ్ఞానం, సంస్కృతి పంచిన గొప్ప దేశం మనది. ‘హిందువులంతా బంధువులు అనే నినాదం మహోన్నతమైనది. కానీ ఆ నినాదం వాస్తవ జీవితంలో ప్రతిబింబిస్తుందా? అనేది ప్రశ్నార్థకమే! కుమ్మెర గ్రామ ఘటన దీనికి సజీవ సాక్ష్యం. వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న వర్ణ-కుల వ్యవస్థ ఈ దుర్ఘటనకు మూలకారణం. 

మేమే అధిపతులం అనే మనస్తత్వం పెరిగి, అది బలహీనులపై బలవంతుల దౌర్జన్యానికి పురిగొల్పుతున్నది. దీంతో ప్రజాస్వామ్య ఆలోచనలను పాతరేస్తూ ప్రతిచోట కులస్వామ్య కోరలు రాజ్యమేలుతున్నాయి. ఇదీ దేవాలయాల నిర్వహణ కమిటీలో, పీఠాధిపతుల్లో, ప్రధాన పూజారి స్థానాల్లో, ఆధ్యాత్మిక నిర్ణయ కేంద్రాల్లోనూ స్ఫురిస్తోంది. ఈ ఆధ్యాత్మక ప్రదేశాలలో అణగారిన వర్గాలకు ప్రాతినిధ్యం లేకపోవడమే ఈ ఆధిపత్యానికి నిదర్శనం.

ఏ దేవుడైన సమానత్వం బోధిస్తాడు. కానీ అగ్రకులాలు ఆధిపత్యం ఒక వ్యవస్థను నిర్మించుకొని బిసి, ఎస్‌సి, ఎస్‌టిలను శూద్రులుగా, బానిసలుగా చూస్తున్నారు. అయినా దళిత, బహుజనులు హిందువులంతా బంధువులుగానే భావించుకుంటూ వేల సంవత్సరాలుగా హిందూ మతాన్ని కాపాడుతున్నారు. చారిత్రకంగా వారికి ఆయుధం, భూమి, సంపద, విద్య వంటి ప్రధాన వనరులపై సమాన హక్కులు లభించలేదు. ఈ సామాజిక కట్టుబాట్లు, అసమానతల వల్ల దేశ రక్షణ, ఆర్థిక స్థితి, సామాజిక ఐక్యత దెబ్బతిన్నది. ఉదాహరణకు భారతీయ హిందురాజు పృధ్వీరాజ్ చౌహాన్ కాలంలో జరిగిన తరైన యుద్ధాలలో మహమ్మద్ గోరి భారతదేశాన్నీ ఆక్రమించాడు. ఈ యుద్ధంలో బహుజనుల భాగస్వామ్యం లేకపోవడం వలన దేశం ఆక్రమణకు గురైంది. 

వారి చేతిలో అధికారం ఉండి ఉంటే ఎవరు కూడా కన్నెత్తి చూసే సాహసం చూపేవారు కాదు. ఇప్పటికీ భారతదేశంలో కొన్ని కులాల చేతిలో అధికారం కేంద్రీకృతం కావడం వల్లనే అభివృద్ధి సాధించలేకపోతుంది. దీనికి ప్రధాన కారణం హిందూమతంలోని బిసి, ఎస్‌సి, ఎస్‌టిలకు అధికారం ఇవ్వకపోవడమే. నేటికీ గ్రామస్థాయి నుంచి పట్టణాల వరకు హిందు ధార్మిక కార్యక్రమాలలో అగ్రకులాధిపత్యం రాజ్యమేలుతుందనడానికి కుమ్మెర ఘటన మనకు ఒక గట్టి హెచ్చరిక. ఇది ఆధునిక భారతదేశంలో మానవ హక్కుల ఉల్లంఘన.

దేవాలయం ఒక వర్గం సొత్తు కాదు, భక్తి కులాన్ని అడగదని, దేవుడు జాతి పత్రం చూడడు అనే మాటలు ‘ఆదర్శాలు’ గానే మిగులుతున్నాయి. రోజురోజుకు భయంకరమైన కులం కుట్రలు చాపకింద నీరులా విజృంభిస్తున్నాయి. వెనుకబడిన కులాలను తమ ఆధీనంలో ఉంచుకోవాలనే ఆధిపత్య పోకడలు కొనసాగున్నాయి. ఇప్పటికీ అక్కడక్కడ గ్రామాల్లో అట్టడుగు కులాల ఆలయ ప్రవేశాన్నీ అడ్డుకోవడం, సామాజికంగా బహిష్కరించడం వంటి ఘటనలు వెలుగులోకి వస్తుండడం ఇందుకు ఉదాహరణ. అదేవిధంగా ఆ వర్గాలు రాజ్యాంగం కల్పించిన అధికారాన్ని కూడా చెలాయించడాన్ని ఓర్చుకోలేకపోతున్నారు. 

ఈ క్రమంలో కుమ్మెర ఘటనలో డాక్టర్ విశారదన్ పోరాటం హిందు స్వాభిమానానికి, మానవ గౌరవానికి, రాజ్యాంగ ఆత్మకు సంబంధించిన పోరాటంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఆయన నికార్సయిన పోరాటానికి పలువురు సామాజిక ఉద్యమకారులు, మేధావులు, రాజకీయ పార్టీలు మద్దతిస్తున్నాయి. సమాజం ముందుకు వెళ్లాలంటే అగ్రకులాలు ఆధిపత్య భావాలను విడిచిపెట్టి ప్రజాస్వామ్య గణతంత్ర విలువలను గౌరవించాలి.

రాజ్యాంగ సమానత్వం పేజీల్లో మాత్రమే కాకుండా ఆలయ గర్భగుడిలోనూ, మన హృదయాల్లోనూ ప్రతిఫలించాలి. ఇందుకై సంస్థాగత మార్పులు అవసరం. దేవాలయాల నిర్వహణలో సమాన ప్రాతినిధ్యం కావాలి. కుల ఆధారిత అహంకారాన్ని సామాజికంగా ఖండించే ధైర్యం ప్రతి ఒక్కరిలో రావాలి. కుమ్మెర గ్రామ ఘటనలో చాకలి కుటుంబంపై దాడి చేసిన నిందితుల్ని వెంటనే శిక్షించి బాధితులకు న్యాయం చేయాలి. ఆధ్యాత్మిక ప్రపంచంలో అణగారిన వర్గాలను భక్తులుగా మాత్రమే చూడడం సరికాదు. వారికి నాయకత్వం, నిర్ణయాధికారం, గౌరవప్రదమైన ప్రాతినిధ్యం లభించినప్పుడే హిందువులంతా బంధువులు అవుతారు. 

అదే విధంగా అట్టడుగు వర్గాలు కేవలం భక్తులుగా మిగిలిపోతే సరిపోదు. శివుని సామాజిక సమానత్వం, సమ్మక్క-సారలమ్మల, చాకలి ఐలమ్మల పోరాటంబాటలో నడిచినప్పుడే ఆధిపత్యం అంతమవుతుంది. అప్పుడే రాజ్యాంగం కోరుకున్న సమానత్వం అమలవుతుంది. లేదంటే బిసి, ఎస్‌సి, ఎస్‌టిలు అంధభక్తులుగా మిగిలి, ఆధిపత్య వర్గాల చేతుల్లో బలవడమే అవుతుంది. ఇప్పటికైనా అట్టడుగు వర్గాలంతా మేల్కొని కుమ్మెర ఘటనలో న్యాయం కోసం ఉద్యమించాలి. లేదంటే చరిత్రలో తప్పుచేసిన వాళ్ళుగా మిగిలిపోతారు.

Post a Comment

0 Comments