America's atrocities must be exposed.
We must stand in support of Palestine.— CPI (M) State Secretariat Member Mohammad Abbas"
ఇజ్రాయిల్ హత్యాకాండకు అండగా నిలిచిన అమెరికా దుర్మార్గాలను ఎండగడుతూ పాలస్తీనాకు అండగా నిలబడాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మహమ్మద్ అబ్బాస్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్ లోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో పీపుల్స్ సాలిడారిటీ ఫర్ పాలస్తీనా ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భారతదేశం అనేక సంవత్సరాలుగా పాలస్తీనాకు మద్దతుగా నిలుస్తున్నదని గుర్తుచేశారు.
ప్రస్తుతం అక్కడి ప్రజలకు మంచినీరు, ఔషధాలు, ఆహారం వంటి నిత్యావసర వస్తువులు కూడా అందకుండా ఇశ్రాయేల్ బ్లాక్ చేయడాన్ని ప్రతి ఒక్కరు ఖండించాలని పిలుపునిచ్చారు. బతకడానికి అవసరమైన వాటిని వారికి అందకుండా చేసి, వారి నుంచి మాతృభూమిని లాక్కుంటూ మానవ విలువలకు, యుద్ధ నియమాలకు వ్యతిరేకంగా ఇజ్రాయిల్ దాడులు చేస్తున్నదని విమర్శించారు. సాక్షాత్తు ఇజ్రాయిల్ మంత్రుల్లో ఒకరు, పాలస్తీనాలో పిల్లలు కూడా తమ శత్రువులే అంటున్నారంటే పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో అర్థం చేసుకోవచ్చన్నారు. పాలస్తీనాకు సుదీర్ఘకాలం మద్దతుగా నిలబడిన భారతదేశంలో నేటి పాలకులు ఇజ్రాయిల్ దుర్మార్గ దాడిని అన్యాయంగా భావించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మానవ హక్కుల గురించి అనేక నీతులు మాట్లాడే అమెరికా పాలస్తీనాలో మహిళలు, పిల్లల హక్కులతో సహా అన్ని రకాల హక్కుల హననం జరుగుతుంటే మౌనంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైపెచ్చు గాజా మాకు కావాలని చేసిన ప్రకటన ఆ దేశానికి పెరిగిన సామ్రాజ్యవాద కాంక్షకు తార్కాణమని తెలిపారు.
మాజీ ఎంపీ, సీపీఐ జాతీయ నాయకులు అజీజ్ పాషా మాట్లాడుతూ పాలస్తీనాలో 20 లక్షల మందిని చుట్టుముట్టి ఇష్టానుసారంగా చంపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాంబులు ఇంతటి ప్రమాదకర పరిస్థితిని ఎప్పుడు చూడలేదని తెలిపారు. యుద్ధ నేరాల కింద విచారణ జరపాలనీ, ఇండియా ఇజ్రాయిల్ ను వదిలి మునపటిలాగే పాలస్తీనాకు మద్దతుగా నిలబడాలనికోరారు.
టీజేఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ ఇజ్రాయిల్ కు తన ప్రజలను కాపాడుకునే సర్వాధికారాలు ఉన్నాయన్నారు. అయితే గాజా, వెస్ట్ బ్యాంక్ లను నుంచి పాలస్తీనియన్లను తరిమి ఆక్రమించుకోవాలనుకోవడం సమర్ధనీయం కాదని స్పష్టం చేశారు. ఆస్పత్రులు, పాఠశాలలు, ఆవాస ప్రాంతాలపై దాడులు ఏ మాత్రం సమంజసం కాదని తెలిపారు. ఈ పరిస్థితి చక్కబడేలా ప్రపంచమంతా ఖండించాలనీ, ఆ దిశగా ప్రయత్నించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని గుర్తుచేశారు. పాలస్తీనా స్వయం నిర్ణయాధికారాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ యుద్ధాల నివారణ, శాంతి పరిరక్షణ, మానవ హక్కులను కాపాడే ప్రధాన ఉద్దేశంతో ఐక్యరాజ్యసమితి ఏర్పాటైందని గుర్తుచేశారు. పాలస్తీనాలో సైనికుల మధ్య యుద్ధం జరగడం లేదనీ, ఇజ్రాయిల్ పాలస్తీనా ప్రజలను చుట్టుముట్టి చంపేస్తున్నదనీ, ఇక మానవ హక్కులేవని ప్రశ్నించారు. ఐక్యరాజ్య సమితిలో ఈ అంశాన్ని లేవనెత్తి పాలస్తీనీయులకు న్యాయం జరిగేలా ప్రయత్నించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
సామాజిక కార్యకర్త శారా మాథ్యూస్ మాట్లాడుతూ టర్కీ లాంటి దేశాలు ఇశ్రాయేల్ తో పెద్ద ఎత్తున వ్యాపారాలు చేస్తున్నాయని తప్పుపట్టారు. కాంగ్రెస్ పార్టీ పాలస్తీనాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నదనీ, అదే క్రమంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇశ్రాయేల్తో ఎలాంటి ఒప్పందాలు చేసుకోవద్దని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆల్ ఇండియా తమీర్ మిల్లట్ ప్రధాన కార్యదర్శి ఒమర్ అహ్మద్ షరీఫ్, అడ్వొకేట్ డాక్టర్ ఇస్మాయిల్, పీపుల్స్ సాలిడారిటీ ఫర్ పాలస్తీనా కన్వీనర్ మొహమ్మద్ ఆఫ్టల్ తదితరులు పాల్గొన్నారు.
0 Comments