జూన్ 2024 మార్క్సిస్టు మాస పత్రిక నుండి
వేమన పద్యాలు వందల సంవత్సరాల వరకు గ్రంథస్తం కాకుండా కేవలం సామాన్యుల నోటి మీదనే నిలిచి ఉన్నాయి. 1816లో భారతదేశం వచ్చిన చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ వేమన సాహిత్యం మీద 18 ఏళ్లపాటు పరిశోధన చేసి కొన్ని వందల పద్యాలను సేకరించాడు. అంతేకాదు బ్రౌన్ దొర తెలుగు సాహిత్యానికి విశేష సేవ చేసిన ఆంగ్లేయుడు. తొలి తెలుగు శబ్ద కోశమును ఈయననే పరిష్కరించి ప్రచురించాడు. అదే బ్రౌన్ డిక్షనరీగా పేరొందిన నిఘంటువు. ఇప్పటికీ దాన్ని తెలుగులో ప్రామాణికంగా ఉ వయోగిస్తారు. వేమన పద్యాలను సేకరించడమే కాదు వాటిలోని గొప్పతనాన్ని గ్రహించిన బ్రౌన్ ఆ పద్యాలన్నింటినీ లాటిన్, ఆంగ్ల భాషలలోకి అనువదించాడు కూడా. అందువల్ల తెలుగువారు సిపి బ్రౌన్కు ఎంతో రుణపడి ఉంటారు. విలియం హెూవర్డ్ కాంబెల్
(1910), జి ఎమ్ పోప్ గోవర్ వంటి ఆంగ్ల సాహితీవేత్తలు వేమనను లోక కవిగా కీర్తించారు. తెలుగువారిలో వేమన కీర్తి అజరామరం చేయటానికి కృషి చేసిన వారు కట్టమంచి రామలింగారెడ్డి. రాష్ట్రంలో పలుచోట్ల వేమన జయంతి ఉత్సవాలు నిర్వహించటానికి రామలింగారెడ్డి గారి కృషి ఎంతో ఉన్నది. 1839లో తొలిసారిగా బ్రౌన్ ద్వారా వేమన పద్యాలు పుస్తక రూపంలో వెలుగులోకి వచ్చాయి.
వేమన కాలం గురించి, ఆయన జీవితం గురించి, సిపి బ్రౌన్, వంగూరి సుబ్బారావు, వావిళ్ళ వెంకటేశ్వర శాస్త్రి, బండారు తమ్మయ్య, ఆరుద్ర, రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ, వేమూరి విశ్వనాథ శర్మ, కొమర్రాజు వెంకట లక్ష్మణ రావు, పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి, కట్టమంచి రామలింగారెడ్డి, త్రిపురనేని వెంకటేశ్వరరావు, ఆచార్య ఎన్ గోపి పరిశోధనలు చేశారు. అయినప్పటికీ వేమన సరిగ్గా ఏ కాలం వాడో పూర్ణంగా గుర్తించలేకపోయారు. సుమారు 1652- 1730 మధ్యకాలంలో జీవించి ఉండవచ్చు. అని ఒక అభిప్రాయం. మరో అభిప్రాయం ప్రకారం 1352-1430 మధ్యకాలంలో జీవించి ఉండవచ్చు. వేమన ఏ కాలానికి చెందినవాడు అనే దానిమీద అనేక పరిశోధనలు జరిగినప్పటికీ ఏకాభిప్రాయం లేదు. వేమన ఫలానప్పుడు జన్మించాడు అనటానికి ఇంతవరకు సరైన చారిత్రక ఆధారాలు దొరకలేదు.
కులమత బేధాలను నిరసించిన వేమన యొక్క కులం గురించి పరిశోధకులు ఒక అభిప్రాయానికి రాలేకపోయారు. సిపి బ్రౌన్ వేమన జంగం (శైవ సంస్కర్తల కులం) కులానికి చెందిన వాడని అభిప్రాయపడ్డాడు. వేమన రెడ్డి కులానికి, కాపు కులానికి చెందినవాడు అని కూడా మరికొందరు భావించారు. ఆయన పద్యాలను బట్టి కొందరు భావించినా కాపు, రెడ్డి అనే కులాలు దత్త మండలాలలో పర్యాయపదాలుగా వాడబడు తున్నాయి. కావున ఏ కులమని నిర్ధారించలేకపోయినా పద్యాలలో కనిపించే వ్యవసాయ పరిజ్ఞానం వలన ఆయన రైతు కుటుంబానికి చెందిన వాడు అని నిర్ధారించవచ్చు అని అంటారు మరి కొందరు. వేమన ఏ కులం వాడు అన్నది అప్రస్తుతం. ఆయన ఒక నిండైన మనిషి, ఆయన లోకానికి అందించిన అపూర్వ సాహిత్యం ఒక సత్యనిఘంటువు.
వేమన పద్యాలలో వాడిన ప్రాంతాన్ని సూచించే పదాలు (పచ్చ, దుడ్డుట, బిత్తలి లాంటివి) రాయలసీమ ప్రాంతంలో మాత్రమే వాడుకలో ఉన్నందున ఆయన రాయలసీమ వాడు అని చెప్పవచ్చు.
పరిశోధనలు కొనసాగిన క్రమంలో వేమన వాడిన మక్కా, అల్లా, మహమ్మద్, గులాము, బిక్కలు, జింజిరీలు వంటి పర్యయ పదాలు వాడకం వల్ల ఇతడు 17వ శతాబ్దం
వాడని, రాయలసీమ ప్రాంతానికి చెందిన వాడని తేలిందని అంటారు కొందరు. వేమన జీవితం గురించి అనేక కథలు, కథనాలు ఉ న్నాయి. అవేవీ అంత విశ్వసించదగినవి కావు. జీవిత విశేషాలను కథలుగా చెప్పుకోవటం ఆంధ్రులకు అలవాటే. అది పరిపాటే. అందువలన వాటికి అంత ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం లేదని చరిత్రకారులు భావిస్తూ ఉంటారు.
ప్రాపంచిక జీవితంలో ఎంతో మోసం, కపటం, నాటకం, డంబం గ్రహించిన వేమన, వాటిని రూపుమాపటానికి సన్యాసులు చూపించే పరిష్కారాలు వట్టి బూటకం అని ఆ సన్యాసుల బ్రతుకులలో కూడా అవే లక్షణాలు ఉన్నాయని తెలుసుకున్నారు. వారి మోసాన్ని ఎలుగెత్తి చాటాడు. వేమన పద్యాలు లోకనీతులు. సామాజిక చైతన్యం వేమన పద్యాల లక్షణం. వేమన సృజించని అంశం లేదు. పట్టించుకోని పార్శ్యం లేదు. సమాజంలోని అన్ని సమస్యలు భిన్న కోణాల్లో దర్శించి ఆ దర్శన వైశిష్ట్యాన్ని వేమన తన పద్యాలలో ప్రదర్శించాడు. కుటుంబ వ్యవస్థలోని లోటుపాట్లు, మతం పేరిట జరుగుతున్న దోపిడీలు, విగ్రహారాధనను నిరసించటం, కుహానా గురువులు, దొంగ సన్యాసులు ఒకటేమిటి కనిపించిన ప్రతి సామాజిక అవకతవకల మీద వేమన్న కలం ఝులిపించాడు. సమాజానికి పట్టిన చీడ పీడను, బూజును చీపురుతో దులిపివేశాడు. పద్యాలన్నీ ఆట వెలదిలోనే చెప్పాడు. ఎంతో లోతైన భావాన్ని కూడా సరళమైన భాషలో " చక్కటి ఉదాహరణలతో హృదయానికి హత్తుకునేలా చెప్పాడు వేమన. మొదటి రెండు పాదాల్లో నీతిని ప్రతిపాదించి మూడోపాదంలో దానికి తగిన సామ్యం చూపిస్తాడు. ఉదాహరణకు అల్పుడెపుడు పలుకు నాడంబరముగాను సజ్జనుండు పలుకు చల్లగాను కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా
విశ్వదాభిరామ వినురవేమ. కొన్ని పద్యాలలో ముందే సామ్యం చెప్పి, తరువాత నీతిని చెబుతాడు.” అనగ అనగ - రాగ మతిశయించునుండు/తినగ తినగ వేము తియ్యనుండు/సాధనమున పనులు సమకూరు ధరలోన/విశ్వదాభిరామ వినురవేమ.
వేమన గొప్ప గొప్ప ప్రబంధాలను, సంస్కృతంలో పురాణాలను, రాజులను కీర్తిస్తూ కవిత్వాన్ని రాయలేదు. అతి సామాన్య ప్రజానీకానికి సులభమైన తెలుగు చాటు వద్యాలలో తత్వాన్ని వివరించడానికీ, సమాజంలో ఉన్న మురికిని ఎండగట్టటానికి ప్రయత్నం చేసిన ప్రజాకవి. సామాన్య ప్రజలకు అర్థమయ్యే ఉదాహరణలు తీసుకోవడం, పద్యాలలో హాస్యస్ఫూరకతను జోడించడం, తన పద్యాలలో సమకాలీన అంశాల ప్రస్తావన ఉండటం, పద్యాలలో ఎత్తిపొడుపులు ఉ ండటం, సమాజంలో కరుడుగట్టి ఉన్న సాంప్రదాయాల పట్ల నిరసన ధ్వనించడం ఆయన పద్యాలలోని ప్రత్యేకత.
అంది వచ్చిన అనుభవాలను ఆటవెలదు ల్లో అలవోకగా లోకానికి అందించాడు వేమన. మితిమీరిన విగ్రహారాధన, అవివేకంతో కూడిన సంప్రదాయాలు, పాటింప వీలులేని, కొన్ని వర్గాలకే పరిమితమైన "విజ్ఞానం” వంటివి వేమనకు నచ్చలేదు. వేదం చదివామని చెప్పే వారిలో "వివేకం" శూన్యం అని వేమనకు తెలుసు. దేవాలయాల ముసుగులో జరిగిన దారుణాలు, వ్యాపారాలు నాటి సమాజంలో చీకటి దృశ్యాలను ఆయన చూశారు. పురుషాధిక్యతతో స్త్రీలను దేవదాసీలుగా చిత్రించటం వెనుక స్వార్థపరుల కుట్రలను వేమన గ్రహించాడు. వేశ్యల వెనుకబడి “విత్తం"(సొమ్ము) పోగొట్టుకుని వెర్రివారైన విటుల జీవితాలు, వారి కుటుంబాల్లోని విషాదం ఇలాంటివన్నీ ఆయన గ్రహింపు కొచ్చిన అంశాలు. ఒక వైపున స్త్రీ ఔన్నత్యం గురించి శాస్త్రాలు ఘోషిస్తూనే అవే శాస్త్రాలు ఆమెను ఒక భోగ వస్తువుగా పరిగణించిన విషాదాన్ని ఆ శాస్త్రాలలో ఉన్న చౌకబారు తనాన్ని, ఆనాటి నమాజవు "నహజ రీతిగా చలామణి కావటానికి గర్హించాడు. కనుకనే ఆయన తన పద్యాలలో ఆచార సంప్రదాయాలను గొప్పవిగా అంగీకరించ లేకపోయాడు. కారణం ఆనాటి సమాజంలోని ఒక వర్గపు ఆధిపత్యం. కుహనా సంప్రదాయ వాదుల విలాసవంతమైన జీవితాల వెలుగు ఆయన్ను ఆలోచింపజేశాయి. వేమన దృష్టిలో మనిషే దేవుడు. ఆయన మతం మానవతా వాదం."బాపడనగా నేమి? భక్తుడనగ నేమి?/ఇనజుడు (యముడు) పనితీర్చు/విశ్వదాభిరామ వినురవేమ. బ్రాహ్మణుడైన, భక్తుడైన, జోగి అయిన ఎవరైనా సరే చివరకు యమధర్మరాజు చేత పడవలసిన వారే. అనే పద్యమే ఈ వాదాన్ని బలపరుస్తుంది.
ఆచారాలు పాటించే వారిలో చిత్తశుద్ధి శూన్యతను వేమన గమనించాడు. ఈనాటి సమాజంలో కూడా ప్రచారం కోసమే భక్తి ఆచారాలు పాటించేవారే ఎక్కువ. డబ్బు ఖర్చును బట్టి తమ స్థాయికి తగిన, తన స్థాయికిమించిన పూజలు, భజనలు చేస్తున్న భక్త శిఖా మణులను మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. అయ్యప్ప దీక్ష పట్టే ముందు రోజు వరకు, పీకలదాకా తాగే అయ్యప్ప భక్త శిఖామణులు వారి శక్తికి మించి ఖర్చు చేస్తూ గొప్ప భక్తులుగా చలామణి అయ్యే వారి గురించి ఆనాడే వేమన ఊహించి చెప్పాడేమో అనిపిస్తుంది. ఇటువంటి వాళ్ళను ఉద్దేశించే, వారి కోసమే "ఆత్మ శుద్ధి లేని ఆచార మదియేల/బాండ శుద్ధి లేని పాకమేల/చిత్త శు ద్ధి లేని శివ పూజ లేలరా?/విశ్వదాభిరామ వినురవేమ అని ప్రశ్నించాడు వేమన. అంతేకాదు వేదం చదివిన వారు వివేకులుగా ప్రవర్తించక అనైతిక కార్యాలకు పాల్పడటం వేమన చూశాడు కనుకనే "వేద విద్యలెల్ల వేశ్యల వంటివి/భ్రమలో పెట్టి తేటపడగ నీవు/గుప్త విద్య ఒక్కటే కులకాంత వంటిది/అన్నాడు. వేమన. ఆనాటి కర్మకాండలోని డొల్లతనాన్ని వేమన నిరసించాడు. ఇవన్నీ పురోహితుల భుక్తి కోసమేనని ఆయన గమనించాడు. "పిండంబు లను చేసి పితరులను దలబోసి / కాకులకు పిండంబులను పెట్టు గాడ్గేలారా/పియ్యి తినెడి కాకి పితరు డేట్లాయేరా. అంటూ ప్రశ్నించడం ద్వారా భావదాస్యంలోకి ప్రజలను నెట్టే పురోహిత వర్గాలను తూర్పారపడ్డాడు. ఇందుకు కారణం లేకపోలేదు ఆనాటి సంఘంలో యజ్ఞాలు యాగాలు చేసేటప్పుడు యజమాని భార్య తాను వ్యభిచరిస్తే, ఎంతమందితో సంబంధంలోకి పోయిందో సూచించటానికి అన్ని గడ్డి పోచలను పెట్టాలనేది ఆనాటి ఓ ఆచారం. తద్దినాలలో పేరుకు తండ్రి ఎవడైనా జన్మ ఇచ్చిన వాడేవడో వాడికే పిండం చెందుతుంది. కట్టుకున్న భార్య రంకు, కన్నతల్లి రంకు బయట పెట్టించే కర్మకాండ దుర్మార్గమే.
ఇలాంటి నాటు సత్యాలను బహిర్గత పరుస్తూ,
దుర్మార్గాలను ఆ ఆచారాలను వేమన వ్యతిరేకించాడు. "ఆలి రంకు తెలుపు అఖిల యజ్ఞంబులు/తల్లి రంకు తెలుపు తద్దినములు/ కాని తెరువు కర్మకాండ కల్పిత మాయే/ విశ్వదాభిరామ వినురవేమ. అంటూ ఆనాటి పురోహిత వర్గం యొక్క జారత్వాన్ని బహిరంగ పరిచాడు. వాళ్ల మెదడులను ములు కర్రతో ఒక పోటు పొడిచాడు.
దేవుడంటే ఎవరు? ఎక్కడున్నాడు? కనిపించని దేవుని గురించి గొప్పగా కీర్తించి, కళ్ళ ముందు కనిపించే మనిషిని జాతి, కుల, మత, వివక్షలతో, ఆర్థిక అసమానతలతో వేధించే మనుషులను వేమన దూషించాడు, ద్వేషించాడు. తన హేతువాద భావాల తూటాల వర్షం కురిపించాడు. అసలు దేవుడు ఎక్కడున్నాడు అని నిలదీశాడు. "దేవుడనగ వేరే దేశమందున్నాడే/ దేవుడనగ తనదు దేహమందు/వాహనంబు లైదు వడి తోలుచున్నాడు". మనిషిని నడిపించే జీవచైతన్యమే దేవుడు. పాడి, పంట, రైతు, తల్లి, తండ్రి, మానవత్వం ఇవే దైవ స్వరూపాలుగా వేమన సిద్ధాంతీకరించాడు.
తన కాలం నాటి అనేక ఆచారాలను మూడనమ్మకాలను వేమన తిరస్కరించాడు. వాటిని దుయ్యబట్టాడు. వేమన తీవ్రమైన భావాలు గలవాడు. వేమన రచనల్లో భావం, భాష రెండూ ఒకదానితో ఒకటి పోటీపడి ఆయన హృదయం నుండి దూకి పైకి వస్తాయి. అమాయక ప్రజలైన వారిని పేదవారుగా మార్చే వారిని ఆకలి చావులకు గురి చేసే మతాధికారుల మౌడ్యపు చేష్టలను నిర్ద్వందంగా తిరస్కరించాడు. ఆనాటి మత పెద్దలు చెప్పే బోధనలో స్వర్గంపై మమకారం కన్నా రంభ ఊర్వశిల పైన ఆశ ఎక్కువగా ఉండేది. యజ్ఞం చేసిన తండ్రి, కొడుకు ఇద్దరు మరణిస్తే ఇద్దరు. రంభతో రమిస్తే అప్పుడు వాళ్ళిద్దరూ వావివరసలు తప్పి పాపం చేసినట్లు కాదా? అని ప్రశ్నించాడు వేమన. "తల్లితో రమించే తండ్రి యజ్ఞం చేసి/ తనయుడట్లే రంభ దనరగూడే/తల్లిని రమయింత్రు దబ్బర విప్రులు/ విశ్వదాభిరామ వినురవేమ అని ఎత్తి చూపాడు. ఆచార వ్యవహారాల్లో "శకునముల"కు ప్రాధాన్యత ఇస్తారు. విధవలను దుశ్శకునంగా భావించేవారు. వేమన ఇక్కడ కూడా తన పదునైన విమర్శనాస్త్రములను సంధిస్తాడు. శకునం అనగా పక్షి అని అర్థం. పక్షులకు శకునాలకు సంబంధం ఉంది. అది వేరే విషయం. శకునాలను ఆరు రకాలుగా విభజించారు. వీటిని తీవ్రంగా నిరసించిన వేమన "మంచి శకునములనె ఎంచక పెండ్లాడు/
మునీశ్వరులు ముక్కుమూసుకుని తపస్సు చేసుకుంటూ ఉంటారని జనుల విశ్వాసం. వాళ్లకు సిద్ధులు మహిమలు ఉంటాయని వారిని సేవించుకుని ఉపదేశం పొందితే మోక్షం సిద్ధిస్తుందని మరో విశ్వాసం. అటువంటి గురువును వెతుక్కుంటూ కొండ గుహల్లోకి వెళితే, గురువుకు బదులుగా క్రూర జంతువు ఏదైనా ఎదురుపడితే ముందుగా అదే తనకు భుక్తి దొరికిందని శిష్యునికి ముక్తి మార్గం చూపెడుతుంది. అని చమత్కారంగా చెప్తాడు వేమన. అలానే రూపం లేని దేవతలకు రూపాన్ని ఆపాదించి రాళ్లను బొమ్మగా చెక్కి ఆరాధిస్తారు. అలా ఆరాధించే వాళ్ళని ఉ ద్దేశించి “శిలను ప్రతిమ చేసి చీకటింటను బెట్టి/ మ్రొక్క వలదు వెర్రి మూడులారా/జీవులందే గాని శిలలందు లేడయా/విశ్వదాభిరామ వినురవేమ." శిలలను శిల్పాలను చెక్కి గర్భగుడిలో పెడతారు. ఏ గర్భగుడి అయినా చీకటి మయమే. బహుశా చీకటి మన అజ్ఞానానికి నిదర్శనం కాబోలు అనిపిస్తుంది. అలాంటి చీకటింట పెట్టిన శిలకు మ్రొక్కటం వెర్రితనం, మూర్ఖత్వం. దేవుడనేవాడు ఉంటే గింటే జనుల్లో ఉంటాడు గానీ శిలల్లో ఉండడు అని ప్రబోధిస్తున్నాడు వేమన్న. దేవాలయంలో విగ్రహాలకు పట్టుబట్టలు కట్టబెడతారు. అలంకరిస్తారు. ఆపైన ప్రార్థిస్తూ కోరికలను కోరుకుంటారు. వాళ్లను ఉద్దేశిస్తూ "రాతి బొమ్మ కేల రంగయిన వలువలు/గుళ్ళు గోపురములు కుంభములను/కూడు గుడ్డ తాను కోరు నా దేవుడు/విశ్వదాభిరామ వినురవేమ.” దేవాలయంలో దేవుడి విగ్రహానికి విలువైన ఆభరణాలు చేయిస్తారు. పట్టు వస్త్రాలు కట్టబెడతారు. గోపురాలకు బంగారు పూతల పూయిస్తారు. నైవేద్యానికి కుంభాలు పోస్తారు. లోకంలో గూడు గుడ్డ లేని వాళ్ళు కోటానుకోట్లు ఉన్నారు. అన్న వస్త్రాలు అర్దించే అటువంటి వాళ్లకు పెట్టకుండా అడగని దేవుడికి పెడతారు. నిజానికి దేవుడి పేరు చెప్పి పొట్ట పోసుకునే వాళ్లే అదంతా కైంకర్యం చేస్తారు. లోకంలో సహజంగా మంచి పనుల కన్నా సరదాలకు, సరసాలకు సొమ్ము వెచ్చిస్తూ ఉంటారు. అలాంటి వారిని ఉద్దేశిస్తూ వేమన వ్యంగ్యంగా ఇలా అంటాడు.”కల్లుకిచ్చినట్లు చల్లకి ఇవ్వగలేరు/కొల్ల కిచ్చునట్లు కుడువలేరు/బుల్ల కిచ్చునట్లు పుణ్యానికీయరు/విశ్వదాభిరామ వినురవేమ." సాటివారికి కల్లుకొని పోస్తారే తప్ప లేని వాళ్లకు చల్ల పోసే చలివేంద్రాలు కట్టించరు. ఎవరో కొల్లగొట్టుకు పోతే కిక్కురుమనకుండా ఉంటారు కానీ అలా కొల్ల పోవడానికి ముందే ఆ సొమ్ము హాయిగా ఖర్చుపెట్టి తృప్తిగా తినలేరు. లైంగిక సుఖాలకు వెచ్చించినట్లుగా మంచి కార్యాలకు ఇవ్వలేరు. ఈ మానవ నైజాన్ని నిరసిస్తాడు వేమన. మనుషుల మధ్య సమానత్వం ఉండాలని చెబుతూ "ఉర్వి వారి కెల్ల నొక్క కంచంబు పెట్టి/పొత్తు గుడిపి కులము పోలయజేసి/తలను చెయ్యిపెట్టి తగ నమ్మ చెప్పరా/విశ్వదాభిరామ వినురవేమ" అంటాడు. సమాజంలో ఉన్న బాధలకు, దుఃఖాలకు, దురహంకారానికి, దౌర్జన్యానికి, గర్వానికి, మూల కారణం వర్ణ వ్యవస్థ, వర్గ విభజన అన్న సత్యాన్ని వేమన తెలుసుకున్నాడు. మానవులంతా ఒక్కటే అన్న నగ్న సత్యాన్ని చాటి చెప్పాడు. మానవులలో ఎక్కువ తక్కువలో ఉన్నంతకాలం చిక్కులు తప్పవు అంటాడు వేమన.
వేమన పద్యాలు తెలుగు సాహిత్య వనంలో విరబూసిన రత్నాల హారాలు. ఆయన చెప్పిన ప్రతి విషయం ఒక సత్య నిఘంటువే. పండిత లోకానికి పరిమితమైన వేదాంతాన్ని అతి సామాన్య మానవునికి కూడా అందుబాటులో ఉండేట్లు స్వచ్ఛమైన అచ్చమైన తేనె లాంటి తేట తెలుగు పద్యాలలో వివరించిన మహానుభావుడు వేమన. తన భావాలను సూటిగాను స్పష్టంగాను తన పద్యాల ద్వారా మృదు మధురమైన భాషలో విప్పి చెప్పినాడు. ఈ స్పష్టత ప్రాపంచిక విషయాలందు మరీ ఎక్కువ. ప్రతి పద్యానికి ఆనాటి చారిత్రక, నైసర్గిక, సాంఘిక, నైతిక, ఆర్థిక, రాజకీయ, మత వ్యవస్థలతో సంబంధం ముడిపడి ఉన్నది. అందువల్లనే ఒకే పద్యం అనేక కోణాలలో అనేక అర్ధాలను ఇవ్వగలుగుతున్నది. ఇందులోకి ఈ వేమన పద్యమే నిదర్శనం
వేయి విధము లమర వేమన పద్యంబు లర్ధ మిచ్చు వాని సరసి చూడ చూడ జూడ గలుగు చోద్యమౌ జ్ఞానంబు విశ్వదాభిరామ వినురవేమ.
"విశ్వదాభిరామ వినురవేమ"అనే మాట వినని తెలుగు వారు, వానకు తడవని వారు. వేమన పద్యం ఒకటి కూడా రాని తెలుగువారు ఉండరు.
ఇక వేమన జీవిత చరిత్రను ఎంతో కళాత్మకంగా సినిమాగా తీశారు 1947లో కేవీ రెడ్డి గారు. చిత్తూరు నాగయ్య గారు వేమనగా జీవించారు. ఇదే వేమన జీవితాన్ని నటుడు విజయ్ చందర్ కూడా నిర్మించారు. శ్రీ వేమన చరిత్రగా 1986లో విడుదలైన ఆ సినిమా కాలానుగుణంగా కాస్త మార్పులతో తీసినా గొప్ప విజయవంతం కాలేదు.

0 Comments