రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడానికి ప్రభుత్వం రూపొందించిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల యాక్షన్ ప్లాన్ అమలుకు సంబంధించి కీలక సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర క్రీడా, యువజన సర్వీసులు, పాడి పరిశ్రమాభివృద్ధి, పశుసంవర్ధక మరియు మత్స్య శాఖల మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొని అధికారులకు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలిసి జరిగిన ఈ సమావేశంలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు యాక్షన్ ప్లాన్ అమలు విధానంపై విస్తృతంగా చర్చించారు.
గ్రామ స్థాయి నుంచే అభివృద్ధి ప్రారంభం
ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ, ప్రభుత్వం రూపొందించిన 99 రోజుల యాక్షన్ ప్లాన్‌ను గ్రామం నుంచి మండలం, నియోజకవర్గం, జిల్లా స్థాయికి విస్తరించేలా అమలు చేయాలని సూచించారు. ప్రభుత్వం ఎంత మంచి ప్రణాళికలు రూపొందించినా వాటి అమలు అధికారుల సహకారంతోనే సాధ్యమని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా అనుకూలంగా లేకపోయినా ప్రభుత్వం సంక్షేమ పథకాలను నిరంతరం అమలు చేస్తోందని తెలిపారు. ప్రతి అర్హుడైన లబ్ధిదారుడి గడపకు సంక్షేమ పథకాలు చేరేలా అధికారులు కృషి చేయాలని ఆయన సూచించారు.
రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు
లబ్ధిదారుల ఎంపికలో రాజకీయాలు, భేషజాలు లేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని మంత్రి స్పష్టం చేశారు. ఒకవేళ అర్హులకు పథకాలు అందకపోతే కారణాలను గుర్తించి వెంటనే పరిష్కరించాలన్నారు.
అధికారులు గ్రామాలకు వెళ్లి ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుని వేగంగా పరిష్కారం చూపాలని సూచించారు.
99 రోజుల్లో గ్రామాల్లో మార్పు
ఈ యాక్షన్ ప్లాన్ ద్వారా ప్రతి గ్రామం, మండలం, నియోజకవర్గంలో స్పష్టమైన అభివృద్ధి కనిపించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తెలిపారు. ముఖ్యంగా
-
రోడ్లు
-
తాగునీటి సదుపాయాలు
-
శానిటేషన్
-
విద్య
-
వైద్యం, ఆరోగ్యం
-
పశుసంవర్ధక రంగం
క్రీడా మౌలిక వసతులు
వంటి అన్ని రంగాల్లో మార్పు రావాలని ఆయన పేర్కొన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే ఈ లక్ష్యం సాధ్యమవుతుందని తెలిపారు.
యువతకు క్రీడలపై ప్రోత్సాహం
యువతలో ఆరోగ్యకరమైన జీవన విధానం పెంపొందించేందుకు “మత్తు వదలండి – మైదానాలు చేరండి” అనే సందేశాన్ని గ్రామాల వరకు తీసుకెళ్లాలని మంత్రి సూచించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ పెంపుపై కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నదని, త్వరలో దీనిపై నిర్ణయం వెలువడే అవకాశముందని తెలిపారు.
విద్యార్థుల్లో క్రీడలపై అవగాహన పెంచి గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికితీసి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
అంతర్జాతీయ హాకీ టోర్నమెంట్‌కు హైదరాబాద్ ఆతిథ్యం
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో మార్చి 8 నుంచి “ఫెడరేషన్ ఇంటర్నేషనల్ హాకీ వరల్డ్ క్వాలిఫై ఉమెన్ హాకీ టోర్నమెంట్ 2026” నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే క్రీడల్లో గాయపడిన క్రీడాకారుల చికిత్స కోసం గచ్చిబౌలిలో ఆధునిక క్రీడా వైద్యశాలను నిర్మించనున్నట్లు వెల్లడించారు.
సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి
ప్రభుత్వం చేపడుతున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు విస్తృతంగా అందించాలన్నారు. ముఖ్యంగా
-
రైతులకు వరి బోనస్
-
రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ
-
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం
-
మహిళలకు ఆర్‌టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
-
స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు
-
పెట్రోల్ బంకులు, అద్దె బస్సుల నిర్వహణలో మహిళలకు అవకాశాలు
వంటి పథకాలను గ్రామస్థాయికి తీసుకెళ్లాలని సూచించారు.
సమిష్టి కృషితోనే విజయవంతం
ఈ అన్ని కార్యక్రమాలు విజయవంతం కావాలంటే అధికారులు క్షేత్రస్థాయిలో పని చేసి ప్రజలతో అనుసంధానం పెంచాలని మంత్రి పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు.
సమావేశంలో పాల్గొన్నవారు
ఈ సమావేశంలో మంత్రి వాకిటి శ్రీహరి తో పాటు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, రాందాస్ నాయక్, తెల్లం వెంకట్ రావు, కోరం కనకయ్య, ఎమ్మెల్సీ తాతా మధు, ఖమ్మం కలెక్టర్ అనుదీప్, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

.jpeg)
.jpeg)
0 Comments