రచన: సాంబరాజు యాదగిరి
93460 18141
----------*--------
తెలంగాణ గానం
రతనాల వీణ నాధం
సప్త స్వరాలను దోసిట పట్టిన
గోగుపూల గీతం
తెలంగాణ స్వేచ్చ గానం
1
కొదమ సింహం కొమరం భీమ్
అడవి బిడ్డల భూపోరాటం
బానిస బతుకుల రణ సంకేతం
బందగి జిందగీ చిందిన రుధిరం
పాలకుర్తి ఐలమ్మ పౌరుషం
దొడ్డి కొమురయ్యది అమరత్వం నాలుగువేల రైతుబిడ్డల
రక్తతర్పణం సాయుధ సమరం
రాచరికానికి చరమగీతం
ప్రజాపాలనకు పలికే స్వాగతం. ll
2
భాగవతము బొమ్మెర పోతన
సోమనాథుని బసవపురాణం
దాశరధి కాళోజీ కత్తులు
సుద్దాల హనుమంతు సుద్దులు
బండెనుక బండి కట్టిన యాదగిరి తిరునగరుల సాహిత్యపు సిరులు
సినారె సినిమా పాటల ఊట
ప్రజా కవులు తిరిగాడిన తోట ఉద్యమాలకిది ఉగ్గు బువ్వరా
తెలంగాణ జనపదం పాటరా ll
3
ఒగ్గు కథకు ఇది పుట్టినిల్లురా
పేరిణి నృత్యం పురిటి గడ్డరా
చిందు యక్షగానం మధురం
ధ్వని అనుకరణకు కీర్తి కిరీటం
బోనాలతో శివసత్తులాటలు
అసోయ్ దూలా ఆలువ పాటలు
పెద్ద రమాస పొద్దుపొడుపుతో
పల్లె పాట బతుకమ్మ ఆటలు
సద్దుల పండుగ సద్దు ముద్దలు
దసరా జమ్మితో అలాయ్ బలాయి ll
4
చార్మినార్ గోల్కొండ మన
కాకతీయుల కళాతోరణం
లక్నవరం రామప్ప చెరువులు
నల్లగొండ నాగార్జునసాగర్
ఆదిలాబాదు అడవి అందము
నిర్మల్ బొమ్మలు జలపాతాలు
గోదావరి కృష్ణా పరుగులు
కిన్నెరసాని వన్నెల నడకలు
సిరులు కురిసే బయ్యారం గనులు సింగరేణి బంగారం చూడరా ll
5
ఆసియా ఖండం మేటి జాతరా
మేడారం గిరిజనుల మోతరా
ధర్మపురి యాదగిరిగుట్ట
భద్రాచలం వేములవాడ
కొండగట్టు కొమురెల్లి కొరవి
కొలనుపాక కొత్తకొండ బాసర
మెదక్ చర్చ్ దర్గా ఉరుసులు
ఇంద్రవెల్లి నాగోబా గోండులు ఏడుపాయల దుర్గమ్మ బోనం ఆటవిడుపున తెలంగాణము ll
6
నరాలు పలికిన స్వరాల పాట తరతరాలదిర మన తండ్లాట
ధరిత్రి ఎరిగిన చరిత్ర కెక్కని
నెత్తుటి మడుగులదీ పోరాటం దొరతనాన్ని తరిమేసిన చరితం
అఃత పురాలకు పాతరేసినం
నిప్పు కణికెల స్వప్న ప్రపంచం
సామాజిక న్యాయం సమ్మతం
ప్రజారాజ్య స్థాపనయే ధ్యేయం సుఖశాంతులతో ప్రజా జీవితం ll
--------🌹-------
0 Comments