OUR SOCIETY TV


Contact for adds :Vishnu Bashapaka CEO Our Society Media Group Email : vishnubashapaka@gmail.com Cell No: 8019649778 Please do Subscribe youtube channel OUR SOCIETY TV

సాదాసీదాగా జరిగిన షాద్‌నగర్ మున్సిపల్ బడ్జెట్ సమావేశాలు – చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్

Shadnagar Municipal Budget Meetings Held in a Simple Manner – Chairman Agganoor Basaveshwar

షాద్‌నగర్ పట్టణంలో జరిగిన మున్సిపల్ కౌన్సిల్ బడ్జెట్ సమావేశాలు ఎంతో సాదాసీదాగా మరియు నిబంధనల ప్రకారం నిర్వహించామని మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్ తెలిపారు. సమావేశాలపై ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి చేసిన విమర్శల్లో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు.

శనివారం జరిగిన 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మున్సిపల్ బడ్జెట్ సమావేశాలపై వచ్చిన విమర్శలను ఖండిస్తూ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్ మాట్లాడారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ అందే మోహన్, కౌన్సిలర్లు ఎండి సర్వర్ పాషా, పెంటయ్య, మురళీమోహన్ అప్పి, స్థానిక నేత జమ్రుత్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ గత పదేళ్లలో షాద్‌నగర్ పట్టణ అభివృద్ధి వెనుకబడిందని, ప్రస్తుతం నూతన పాలకవర్గం బాధ్యతలు చేపట్టి అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుంటే ప్రారంభ దశలోనే విమర్శలు చేయడం సరికాదని అన్నారు. మంచి పనులు జరుగుతున్న సమయంలో అనవసర విమర్శలు చేయకుండా అందరూ కలిసి పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు.

మున్సిపల్ బడ్జెట్ సమావేశంలో ఎమ్మెల్యేతో పాటు కౌన్సిలర్లు మరియు ఇతర ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారని ఆయన తెలిపారు. సమావేశంలో ఎవరికైనా తమ అభిప్రాయాలు వ్యక్తపరచడానికి అవకాశం ఇచ్చామని, అయితే సమావేశం జరుగుతున్న సమయంలో ఎవరూ మాట్లాడేందుకు ముందుకు రాలేదని చెప్పారు. సమావేశం ముగిసిన తర్వాత మాట్లాడే అవకాశం ఇవ్వలేదని చెప్పడం రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న ఆరోపణలేనని చైర్మన్ పేర్కొన్నారు.

కౌన్సిల్ సమావేశాలు అన్ని నిబంధనల ప్రకారం నిర్వహించామని, ప్రతి సభ్యుడికి మాట్లాడే అవకాశం కల్పించామని తెలిపారు. అధికారులు కూడా తమ విధి నిర్వహణలో భాగంగా సభ్యులకు సహకరించారని చెప్పారు. సమావేశం జరుగుతున్న సమయంలో మాట్లాడాలని కోరితే తప్పకుండా అవకాశం ఇచ్చేవాడినని, కానీ సమావేశం ముగిసిన తర్వాత మైక్ ఇవ్వలేదని ఆరోపించడం విచిత్రంగా ఉందని చైర్మన్ బసవేశ్వర్ వ్యాఖ్యానించారు.

విమర్శలు మానుకోవాలి – వైస్ చైర్మన్ అందేమోహన్

సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ అందేమోహన్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి అనవసర విమర్శలు మానుకోవాలని సూచించారు. మున్సిపల్ కౌన్సిల్ తొలి బడ్జెట్ సమావేశం విజయవంతంగా జరిగిందని తెలిపారు. మాట్లాడే అవకాశం ఇవ్వలేదనే కారణంతో పాలకవర్గంపై విమర్శలు చేయడం తగదన్నారు.

సాదాసీదాగా జరిగిన బడ్జెట్ సమావేశాలకు రాజకీయ రంగు పులిమి వివాదం సృష్టించేందుకు ప్రయత్నించడం సరికాదని విమర్శించారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సహకారంతో షాద్‌నగర్ పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని, పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు.

Post a Comment

0 Comments